మేమంటే నీకంత ద్వేషమా.. బాబూ?

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: కుట్రపూరితంగా కేసులు వేయించి తమ రిజర్వేషన్లను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు భగ్గుమన్నారు. మేమంటే ఇంత ద్వేషమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు రాకుండా తీరని ద్రోహం చేసిన టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ గురువారం వాడవాడలా కదం తొక్కారు. ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు దిగి చంద్రబాబు దుర్బుద్ధిని ఎండగట్టారు. టీడీపీ నేతల నిర్వాకం వల్ల రిజర్వేషన్లు కోల్పోయామని మండిపడుతూ శ్రీకాకుళంలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు.


ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ తమకు మంచి చేసేందుకు అదనంగా రిజర్వేషన్లు తీసుకొస్తే.. అడ్డుకుంటారా అంటూ టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున తగలబెట్టారు. వారి చిత్రపటాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌తో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల బీసీ విద్యార్థులు, నాయకులు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.


చంద్రబాబు నిర్వాకంతో బీసీలు 15 వేలకు పైగా పదవులను కోల్పోవాల్సి వస్తోందని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నాయకులు వాపోయారు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తామని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన బీసీలు, విద్యార్థులు ప్రతినబూనారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఉరి తీసి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. తమను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న చంద్రబాబుకు తమ సత్తా ఏంటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తామంటూ వైఎస్సార్‌ జిల్లా బీసీలు, ప్రజలు హెచ్చరించారు.